ఏపీలో ఒకే ఊరిలో రెండు బాల్యవివాహాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఒకే ఊరిలో రెండు బాల్యవివాహాలు

September 28, 2020

Two child marriages in the same village in AP

సాంకేతికంగా సమాజం ఎన్ని ఆధునిక పోకడలకు పోతున్నా.. ఇంకా కొన్ని గ్రామాల్లో పాత చింతకాయ పచ్చడి ఆచారాలు రాజ్యం ఏలుతున్నాయి. ఇలాంటివాటితో బాధితులు ఎంత నష్టపోతున్నారని వారికి కూడా తెలుసు. అయినా కోరికోరి వారి గొంతులు కోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఒకే ఊరిలో రెండు బాల్య వివాహాలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరరుమల మండలంలోని పాములవారి గూడెంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల్లో రెండు మైనర్ వివాహాలు జరుగుతుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఓ పెళ్లిని అడ్డుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పాములవారిగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడు, మైనర్ బాలిక మధ్య ప్రేమ చిగురించిందని.. దీంతో బాలిక గర్భం దాల్చడంతో ఆదివారం రాత్రి వారిద్దరికీ గ్రామ పెద్దలు వివాహం చేశారని పోలీసులు తమ విచారణలో తేల్చారు. వివాహానికి ముందే తప్పటడుగులు వేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. మరో ఘటనలో మైనర్ బాలుడికి, మరో మైనర్ బాలికకు కూడా సోమవారం ఉదయం వివాహం చేసేందుకు స్థానిక పెద్దలు ప్రయత్నించారు. సమాచారం అందడంతో పోలీసులు ఆ పెళ్లిని కూడా అడ్డుకున్నారు. రెండు సంఘటనల్లోనూ మైనర్ బాలురు ఇద్దరూ అన్నదమ్ములు కావడం గమనార్హం. కాగా, ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్లకు వివాహ వయసుపై అవగాహన కల్పించారు.