లాక్‌డౌన్‌లోనూ వసూల్ రాజాలు.. ఇద్దరు పోలీసుల సస్పెండ్
లాక్‌డౌన్ సమయంలోనూ కొంత మంది పోలీసులు తమ వసూళ్లకు బ్రేక్ ఇవ్వడం లేదు. ఎక్కడ సందు దొరికినా తోచిన సమాన్యుల వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ ఆటో వాలా నుంచి డబ్బులు వసూలు చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ తతంగం అంతా వైరల్ అయ్యాయింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీపీ అంజనీ కుమార్ స్పందించారు. ఇద్దరు వసూలు రాజాలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
జాంబాగ్‌లోని ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఆదివారం ట్రాలీ ఆటోలో ఓ వ్యాపారి సరుకు తీసుకువస్తున్నాడు. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో పని చేసే ముఖేష్, సురేష్ అతన్ని ఆపి వివరాలు ఆరా తీశారు. తనకు అన్ని అనుమతులు ఉన్నాయని చూపించినా వారు వినిపించుకోలేదు. ఎంతో కొంత ముట్టజెప్పి వెళ్లాలని సూచించారు. చేసేదేమి లేక అతడు కానిస్టేబుళ్లకు డబ్బులు ఇచ్చాడు. ఈ వ్యవహారం అంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఇంటిపై నుంచి వీడియో తీశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిపై వేటు వేశారు. అసలే లాక్‌డౌన్‌తో ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే పోలీసులు ఇలా లంచాలకు మరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.