Two dead in Andhra after fire breaks out at firecracker stalls in Vijayawada
mictv telugu

బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

October 23, 2022

దీపావళి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విషాదం చోటుచేసుకున్నది. పటాకుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. నగరంలోని గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్స్‌ దీపావళి మందులు విక్రయించే స్టాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కొక్కటిగా అన్ని పటాకులు పేలడంతో పక్కన ఉన్న మరో రెండు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో మూడు షాపుల్లో దీపావళి టపాసులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.

అగ్ని ప్రమాదంతో భయంతో వ్యాపారులు , ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనా స్థలానికి సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. కాగా భారీ అగ్నిప్రమాదం కారణంగా జింఖానా గ్రౌండ్స్ పరిసర ప్రజలు కాసేపు ఉక్కిరి బిక్కిరి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనం అయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను కాశీ, బ్రహ్మంగా గుర్తించారు. మృతులిద్దరూ బాణసంచా దుకాణంలో పనిచేసే వ్యక్తులు అని పోలీసులు తెలిపారు.