ఆస్కార్ అవార్డు అందుకోవడమనేది సినిమా విభాగానికి చెందిన ప్రతి ఒక్కరి కల. అలాంటిది తొలి ప్రయత్నంలోనే ఆస్కార్ అవార్డు అందుకున్న దర్శకురాలిగా కార్తికి గోన్‌సాల్వెస్ రికార్డు క్రియేట్ చేశారు. ఆమె తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డ్యాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్.. భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్‌కు ఎన్నికై.. అవార్డు కొల్లగొట్టింది. దేశవ్యాప్తంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రముఖులెందరో ఆమె ప్రయత్నాన్ని అభినందించారు. అయితే ఈ ఆస్కార్ అందుకున్న ఆనందం వారికి కాసేపటికే ఆవిరైంది. అందుకు కారణం ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రధాన పాత్ర పోషించిన ఏనుగులే. ఆస్కార్ అందుకున్న ఆనందాన్ని ఆ ఏనుగులు ఆవిరి చేస్తూ యూనిట్‌కి షాకిచ్చాయి.
ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు నటించాయి. అయితే దురదృష్టవశాత్తు ఆ ఏనుగులు ఆదివారం తప్పిపోయినట్లుగా.. వాటి సంరక్షకుడు బొమ్మన్ తెలిపారు.‘తప్పిపోయిన రెండు ఏనుగు పిల్లలో మందలో భాగంగా ఉండేవి. గతవారం ధర్మపురిలో విద్యుదాఘాతానికి గురై చనిపోయిన మూడు ఏనుగుల్లో ఈ పిల్ల ఏనుగుల తల్లులు కూడా ఉన్నాయి. కొంత మంది తాగుబోతులు ఏనుగు పిల్లలను అడవిలోకి తరుముకుంటూ పోయారు. రెండు ఏనుగులూ తమిళనాడులోని కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లి.. అదృశ్యం అయ్యాయి. ప్రస్తుతం నేను వాటిని వెతుకుతున్నాను. వాటిని నేను గుర్తించగలిగితే వాటి సంరక్షించి పెద్దచేసే అవకాశం నాకు దక్కుతుంది. ఒకవేళ వాటి ఆచూకీ నేను కనుగొనలేకపోతే, ఫారెస్ట్ రేంజర్‌కి ఫిర్యాదు చేసి నేను మా సొంతూరుకి వెళ్లిపోతాను’ అని బొమ్మన్ చెప్పారు. ఈ విషయం తెలిసి ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణంలో భాగమైన వారంతా నిరాశకు లోనయ్యారు. ఆస్కార్ అవార్డుతో వాటి దగ్గర ఫొటో దిగాలనుకున్న టీమ్ ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం రఘు, అమ్ము కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం.