నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మంగళవారం రెండు చోట్ల ప్రమాదాలు సంభవించాయి. బాచుపల్లి సాన్వి కన్‌స్ట్రక్షన్‌లో కూలీలు ఉంటున్న గుడిసెలకు మంటలు అంటుకొని వేగంగా వ్యాప్తి చెందాయి. ఈ ఘటనలో మొత్తం 50 గుడిసెలు ఆహుతి అవగా, మంటలను చూసి కూలీలు పరుగులు తీశారు. ప్రాణ నష్టం జరగకపోయినా భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. మంటలకు కారణమేంటో తెలియదు కానీ ఫైరింజన్లు మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరో ప్రమాదం బంజారా హిల్స్ రోడ్ నెం 12లో జరిగింది.
ఓ కమర్షియల్ బిల్డింగులో చెలరేగిన మంటలకు దట్టమైన పొగలు వచ్చి పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో వచ్చిన ఫైరింజన్లు మంటలను ఆర్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు. అటు ఈ ప్రమాదాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవగా, ఏ సమయంలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.