Two Gulab Jamuns cost Rs 400 Zomato's Unbelievable discount offer
mictv telugu

2 గులామ్ జామూన్ ఉండలు రూ. 400 అంట..

February 2, 2023

Two Gulab Jamuns cost Rs 400 Zomato's Unbelievable discount offer

మీరు చదివింది అంకెలారా నిజం. రెండంటే రెండే రెండు గులాబ్ జామూన్ ఉండల ఖరీదు రూ. 400. అంత ఖరీదైనవి అంటే ఖరీదైన కుంకుమపువ్వు, నెయ్యి వంటివాటితో తయారు చేసి ఉంటారని, చిన్నగా కాకుండా ఫుట్ బాల్ అంత పెద్దగా ఉంటాయని పొరపడేరు! అలాంటిదేమీ లేదు. అవి మామూలుగా సైజులో చేసే బుల్లిబుల్లి ఉండలే. మరి అంత ధరెందుకంటారా? అందుకే ఇది వార్తయింది. డిస్కౌంటు మహత్యంతో రచ్చకెక్కింది.

 

ఆ తిండిప్రియుడు ఈ ముచ్చటను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అతని పేరు భూపేంద్ర. ఇటీవల జొమాటో యాప్‌లో పుడ్ ఆర్డర్ ఇవ్వబోయి కంగుతిన్నాడు. రెండు గులాబ్ జామ్‌ల ధర రూ.400గా కనిపించింది. స్పృహ తప్పినవాళ్లపై నీళ్లు చల్లి తెలివిలోకి తెచ్చినట్లు.. వాటిపై 80 శాతం డిస్కౌంట్‌ కనిపించింది. డిస్కౌంట్ పోను రూ.80కు రెండు ఉండలు అన్నమాట. కథ అంతటితో అయిపోలేదు. 200 గ్రాముల గజర్ హల్వా ధర రూ.600. దీనిపైనా యథావిధిగా 80 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.120కే అమ్ముతున్నారు. ఈ మాయను వివరిస్తూ భూపేంద్ర ట్వీట్ చేశాడు.

‘‘రూ.400 విలువైన 2 గులాబ్ జమూన్ ఉండలు, రూ.3000 ఖరీదైన కేజీ గజర్ హల్వాలపై 80 శాతం డిస్కౌంట్. ఇంత కారుచవక ఆఫర్ ను నమ్మలేకపోతున్నాను. నేను 2023లోనే జీవిస్తున్నానా? 2023లో జీవిస్తున్నవారిపై జొమాటో చాలా దయంగా ఉంది’’ అని వెటకరిస్తూ పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. దీంతో జొమాటో స్పందించక తప్పలేదు. విషయం ఆరా తీస్తామని హామీ ఇచ్చింది.