నెల్లూరులో ఘోరం.. గార్డులు, స్వీపర్లతో సర్జరీ, పిల్లాడు బలి - MicTv.in - Telugu News
mictv telugu

నెల్లూరులో ఘోరం.. గార్డులు, స్వీపర్లతో సర్జరీ, పిల్లాడు బలి

May 11, 2022

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వాసుపత్రికి వచ్చిన బాధితులకు చికిత్సనందించాల్సిన డ్యూటీ డాక్టరు ఆ సమయంలో విశ్రాంతి తీసుకున్నాడు. దాంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, కాంపౌండర్లు చికిత్స అందించగా, బాధితుడు చనిపోయాడు. వివరాలు.. మంగళవారం అనంతసాగరం వద్ద బైకు యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో చిరంజీవి, రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలవగా, వారిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన డ్యూటీ డాక్టరు.. ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోయి విశ్రాంతి తీసుకున్నాడు. చిరంజీవి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రామకృష్ణకు సెక్యూరిటీ, స్వీపర్లు, కాంపౌండర్లు సెలైన్, కట్టుకట్టడం వంటివి చేశారు. తలకు కట్టిన కట్టు ఎంతో సేపు నిలవలేదు. కాసేపటికే ఊడిపోయింది. దాంతో రామకృష్ణను కూడా ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, ఈ ఘటనపై రామకృష్ణ కుటుంబ సభ్యులు వైద్యునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగ్ సిబ్బంది ఎక్కడ అంటూ నిలదీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్‌తో ఇంత నిర్తక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.