మార్కెట్లో ఏది హాట్‌హాట్‌గా ఉంటే దాని మీద కన్నేసి దోచుకోవడానికి దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. మహమ్మారి కరోనా వైరస్‌ను కూడా అలా ఏ ముదురు దొంగ అయినా ఎత్తుకుపోయి దానిని నామారూపాల్లేకుండా చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. కానీ, ఈ దొంగలు మాత్రం ఉల్లిని చోరీచేసి జీజనల్ దొంగతనానికి తెరతీశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 550 కేజీల ఉల్లిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. నిందితులను సంజయ్ పరాది, పొపట్ కాలేలుగా పోలీసులు గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా ధరలు పెరిగిన సందర్భాల్లో పలుచోట్ల ఉల్లి దొంగతనాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉల్లి కోసం గొడవలు కూడా జరిగాయి. ధరల విషయంలో వినియోగదారులు, అమ్మకపుదారులు పోట్లాడుకున్నారు.
కాగా, మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇప్పటికే కిల్లో ఉల్లి ధర రూ.100 దాటింది. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర.. ముంబైలో 80 నుంచి 100 రూపాయలు, పుణేలో 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఉల్లి ధరలు పెరగడంపై పుణే మార్కెట్ యార్డ్‌కు చెందిన కమిషన్ ఏజెంట్ విలాస్ భుజ్బాల్ మట్లాడుతూ.. ‘ఎప్పుడూ వచ్చే స్టాక్‌తో పోలిస్తే అక్టోబర్ 21న సగం స్టాక్ మాత్రమే వచ్చింది. కొత్త పంట వచ్చే వరకు రేట్లు పెరుగుతూనే ఉండే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో వేసిన 50 శాతం ఉల్లి పంటలు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటుగా.. సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది. ఇది కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా ఉంది. ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దొంగలు దీనిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు’ అని తెలిపారు.