హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. పాతబస్తీ అడ్డాగా నకిలీ కరెన్సీ దందా కొనసాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. స్థానిక సమచారం మేరకు పాతబస్తీకి చేరుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. పాతబస్తీలో దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
నారాయణపేట జిల్లా, కోస్గికి చెందిన కస్తూరి రమేశ్‌బాబు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కారు మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. స్థానిక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో షెడ్ మూసివేసి కారు డ్రైవర్‌గా జీవితం ప్రారంభించాడు. ఇతడి చెల్లెలు రామేశ్వరి నగరంలోని ఓ వైద్య కళాశాలలో చదువుతోంది. వీరిద్దరూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్ల తయారీని ఎంచుకున్నారు. తక్కువ ధరకు స్కానింగ్ మెషీన్, ప్రింటర్లు తీసుకొచ్చి రూ.500నోటు స్కానింగ్ తీశారు. అది బెడసికొట్టడంతో యూట్యూబ్‌లోని వీడియోలతో నకిలీ నోట్లపై అధ్యయనం చేశారు. ఢిల్లీ వెళ్లి అవసరమైన సామగ్రి కొని తీసుకొచ్చారు. బండ్లగూడజాగీర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ అద్దెకు తీసుకొని రూ.100, 200, 500 నోట్ల తయారీ ప్రారంభించారు. గతేడాది సెప్టెంబరులో గుట్టు బయటపడటంతో గోపాలపురం పోలీసులు రమేష్‌బాబు, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1 నిందితురాలు రామేశ్వరి అజ్ఞాతంలోకి చేరి ముందస్తు బెయిల్ పొందింది.
రమేశ్‌బాబు జైల్లో ఉండగా, బహుదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య కేసులో అరెస్టయిన హసన్ బిన్ హమూద్ పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి నకిలీ నోట్లకు సంబంధించిన ప్రింటింగ్, మార్కెటింగ్‌పై చర్చించుకున్నారు. జైలు నుంచి బయటకు రాగానే రమేశ్‌బాబు తన కుటుంబాన్ని తాండూర్‌కు తరలించాడు. తాండూర్‌లో నకిలీ నోట్ల ముద్రణకు సంబంధించిన సామగ్రిని తెచ్చి రూ. 500 నకిలీ నోట్లు తయారు చేశాడు.ఇలా తయారు చేసిన నకిలీ నోట్లను గుజరాత్‌కు వెళ్లి అక్కడ మొదట చెలామణి చేస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో గుజరాత్ పోలీసులు గతనెల రమేశ్‌బాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఈ క్రమంలో అతడి సోదరి హసన్‌బిన్‌ను సంప్రదించింది. ప్రింట్ చేసిన నోట్లను చెలామణి చేద్దామని ఒప్పందం కుదర్చుకున్నారు. దీంతో ఆమె తన నకిలీ నోట్ల డెన్‌ను చాంద్రాయణగుట్ట ప్రాంతానికి మార్చింది. ఇద్దరు కలిసి నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర బృందానికి విశ్వసనీయ సమాచారం అందడంతో చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వర్మ బృందంతో కలిసి వారి డెన్‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో రూ. 27 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్‌టాప్, ప్రింటర్, నోట్ల తయారీకి వాడని పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా గతేడాది అన్న అరెస్ట్ కాగా, తాజాగా చెల్లెలు అరెస్టయింది.