ఈద్గాకు ఖరీదైన స్థలం దానం చేసిన హిందూ సిస్టర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈద్గాకు ఖరీదైన స్థలం దానం చేసిన హిందూ సిస్టర్స్

May 5, 2022

దేశంలో మతాల మధ్య ఘర్షణ వాతావరణం రోజురోజుకీ పెరుగుతున్న ఈ సమయంలో ఇద్దరు హిందూ సోదరీమణులు చేసిన పని అందరి దృష్టి ఆకర్షించింది. ఉత్తరాఖండ్‌ ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్ అనే చిన్న పట్టణంలో తమ తండ్రి ఆఖరి కోరిక మేరకు 30 కుంటల స్థలాన్ని దానమిచ్చేశారు. ముస్లింలు పండుగల సమయంలో ప్రార్ధన చేసుకునే స్థానిక ఈద్గా విస్తరణ కోసం కోటిన్నర రూపాయల విలువైన వ్యవసాయ స్థలాన్ని ఉచితంగా రాసిచ్చారు. బ్రజ్‌నందన్ రస్తోగి అనే వ్యక్తి 2003లో చనిపోతూ.. తన స్థలాన్ని ఈద్గాకు రాసిచ్చేటట్టు తన సంతానానికి చెప్పాల్సిందిగా బంధువులను కోరాడు. అప్పుడు అతని కుమార్తెలైన సరోజ, అనితలు చిన్నపిల్లలు కావడంతో తన ఆఖరి కోరికను బంధువులకు చెప్పి చనిపోయాడు.

ఈ విషయాన్ని వారి ద్వారా తెలుసుకున్న పిల్లలు స్థానిక ఈద్గా కమిటీని సంప్రదించి కాగితాలు అందజేశారు. తమ తండ్రి ఆఖరి కోరికను తీర్చడం తమ బాధ్యత అని అక్కాచెల్లెళ్లు వ్యాఖ్యానించారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడు హసీన్ ఖాన్ మాట్లాడుతూ..‘దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కాచెల్లెళ్లు చేసిన పని అందరికీ ఆదర్శంగా నిలవాలి. స్థలాన్ని రాసిచ్చిన రస్తోగి కుటుంబానికి ధన్యవాదాలు. చనిపోయిన రస్తోగి ఆత్మ శాంతించాలని మేమంతా ఈద్గాలో ప్రత్యేకంగా ప్రార్ధనలు చేస్తా’మని తెలిపారు.