ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణంలో బీటలు వారిన 600కు పైగా ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రమాదం అంచున ఉన్న ఇళ్లను కూల్చివేస్తోంది ప్రభుత్వం. మంగళవారం నుంచి కూల్చివేతను ప్రారంభించింది. జోషిమఠ్ పట్టణాన్ని మూడు భాగాలుగా విభజించింది. డేంజర్, బఫర్, పూర్తిగా సురక్షితమైన ప్రాంతాలుగా విభజించి కూల్చివేతలు ప్రారంభించింది. ముందస్తుగా ఆ ఇళ్లలోని సుమారు 4000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ స్థానికులు మాత్రం ప్రభుత్వం చేపట్టిన విచక్షణారహిత పనులతో తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, పుట్టిపెరిగిన ఊరుతో భావోద్వేగ బంధాన్ని తెంచుకుని ఎలా తరలివస్తామని ప్రశ్నిస్తున్నారు. పైసాపైసా కూడబెట్టి సమకూర్చుకున్న గూడును ఎలా వీడిపోతామని ఆవేదన చెందుతున్నారు. ఎక్కడికో వెళ్లే బదులు అక్కడే ఉండి ప్రాణాలు కోల్పోతామని కొందరు స్థానికులు కన్నీళ్లతో చెబుతున్నారు.
అయితే జోషీమఠ్ ప్రాంతాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించామని , కూల్చివేతలు తప్పదని చమోలీ కలెక్టర్ హిమాన్షూ ఖురాన తెలిపారు. జోషీమఠ్ , సమీప ప్రాంతాల్లో నిర్మాణ పనులపై నిషేధం విధించామని..చెప్పారు. జోషిమఠ్ పట్టణం కుంగిపోవడంపై కేంద్ర ప్రభుత్వం కూడా సమావేశం అయింది. ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
జోషిమఠ్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ.. దశాబ్ధాల క్రితం విరిగిపడిన కొండచరియలపై నిర్మాణాలు కొనసాగడం, అక్కడ ఏటవాటుగా భూమి ఉండటం వల్ల ఈ జోషిమఠ్ కుంగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. అక్కడి ప్రజలు ఇన్నాళ్లూ ఆ ప్రాంతంలో పెనవేసుకున్న బంధాన్ని వదులుకోవాల్సి రావడం బాధాకరం.