ఇద్దరు జర్నలిస్టులను కారుతో తొక్కి చంపారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు జర్నలిస్టులను కారుతో తొక్కి చంపారు..

March 26, 2018

దేశంలో జర్నలిస్టుల హత్యలు పెచ్చుపెరుగుతున్నాయి. బిహార్‌లో ఇద్దరు పాత్రికేయులను పండగపూట కారుతో ఢీకొచ్చి హత్య చేశారు. భోజ్‌పురి జల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. ఘర్హానీ గ్రామ మాజీ సర్పంచే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దైనిక్ భాస్కర్ హిందీ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్ నిశ్చల్, విజయ్ సింగ్ అనే జర్నలిస్టులు రాత్రి ద్విచక్రవాహనాలపై ఆరా- ససారం హైవేపై వెళ్తుండగా ఎస్‌యూవీ వాహనం వారిని ఢీకొట్టి, పై నుంచి వెళ్లిపోయింది.ఈ కారు యజమాని అయిన మాజీ సర్పంచ్ అహ్మద్ అలియాస్ హర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకర్లకు, అహ్మద్‌కు గొడవ జరిగిందని, ఆ కక్షతోనే చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రికేయులను బలిగొన్న వాహనాన్ని అడ్డుకుని తగలబెట్టారు. అందులోని దుండగులు తప్పించుకుని పారిపోయారు. హర్సు ఇంటిని ధ్వంసం చేశారు. హంతక వాహనాన్ని హర్సునే నడిపాడని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.