మహ్మద్ ప్రవక్తపై ఇటీవలే ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆందోళనలు చేపబడుతున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. నిరసన చేస్తుండంగా కొంతమంది రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా అల్లర్లు మొదలైయ్యాయి. ఈ క్రమంలో కొంతమంది నిరసనకారులు చిరు వ్యాపారుల బండ్లను తగులబెట్టారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు.
ఈ ఘటనపై రాంచీ పోలీస్ కమిషనర్ అన్షుమాన్ కుమార్ మాట్లాడుతూ..”ఇద్దరు గన్‌షాట్ వల్ల గాయాలతో చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో ఎనిమిది మంది నిరసనకారులు, నలుగురు పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉంది. సిటీలో ఆంక్షలను విధించాం. రేపటి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపేశాం” అని ఆయన అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. ‘అందరూ శాంతియుతంగా ఉండాలి. నాకు చాలా సడన్‌గా ఈ విషయం తెలిసింది. జార్ఖండ్ ప్రజలు సున్నిత మనస్కులు, సహనపరులు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి అల్లర్లకు ప్రజలు దూరంగా ఉండాలి’ ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోపక్క నుపూర్ శర్మ తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందిస్తూ, ‘మహ్మద్ ప్రవక్తపై నేను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్తున్నాను. ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. దయచేసి నా చిరునామాను బహిర్గతం చేయకండి. నా కుటుంబ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉంది.” అని ఆమె అన్నారు. అయినా, తమ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పి తిరాల్సిందేనని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.