Two men married in Kolkata
mictv telugu

పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ‘గే’లు.. ఫోటోలు వైరల్

July 5, 2022

Two men married in Kolkata

పెళ్లి అనగానే ఉండే హంగామా అంతా ఇంతా కాదు. వరుడిదేముంటుంది కానీ, ముఖ్యంగా వధువు అలంకరణ, చీరలు, నగలు వంటి సందడి ఓ రేంజులో ఉంటుంది. అయితే ఇక్కడ కూడా పెళ్లి జరిగింది కానీ, వధూవరులకు కాదు. ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఇందులో వింతేముంది ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయంటారా? ఇక్కడే ఉంది ట్విస్టు. ఈ పెళ్లి అచ్చం మన భారతీయ సాంప్రదాయం ప్రకారం జరిగింది.

అంటే వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా జరిగింది. మామూలు పెళ్లి లాగానే ఇందులో కూడా మూడు ముళ్లు వేశారు. అదీకాక, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి చేసుకున్న ఈ పెళ్లి కోల్‌కతాలో ఈ నెల 3న జరిగింది. అభిషేక్, చైతన్య అనే ఇద్దరు 2020లో ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్సయ్యారు. తర్వాత ఇద్దరి అభిరుచులు కలవడంతో స్నేహం చేసి ప్రేమించుకున్నారు. దాంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించి తమతమ కుటుంబాలకు విషయాన్ని చేరవేశారు. వారు మొదట్లో తటపటాయించినా చివరికి ఒప్పుకోవడంతో సుమారు 200 మంది అతిథుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ‘సాధారణంగా ఇలాంటి పెళ్లిళ్లంటే మన కుటుంబాలు ఆలోచనలో పడుతాయి. అలాగే మా కుటుంబాలు కూడా మొదట్లో ఆలోచించాయి. కానీ, మా ఇద్దరి ప్రేమను అర్ధం చేసుకొని చివరకు ఒప్పుకున్నారు. అందరిలాగే మేమూ శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాం’ అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. కాగా, సాంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.