తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 16వేల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రవాణా, ఆబ్కారీశాఖల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి మరో రెండు వేర్వేరు నోటిఫికేషన్లను గురువారం విడుదల చేసింది.
రవాణా శాఖలో 6 పోస్టులు, లోకల్ క్యాడర్లో 57 పోస్టులు కలిపి మొత్తం 63 పోస్టుల భర్తీకి చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఆబ్కారీ శాఖలో ఖాళీగా ఉన్న 614 పోస్టుల భర్తీకి మరో ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు శాఖల్లో కలిపి మొత్తం 677 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు ఎవరు అర్హులు? ఎంత వయస్సు ఉండాలి? రుసుం ఎంత? అనే వివరాలను కూడా వెల్లడించారు. కానిస్టేబుల్ పోస్టులకు 18 ఏళ్లు నిండి, 22 ఏళ్లు మించకుండా, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా అర్హతలు కూడా పోలీసు కానిస్టేబుల్కు వర్తించే విధంగానే వీటికీ కూడా ఉంటాయి.
ఇక, రవాణా శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కంటిచూపు పూర్తిస్థాయిలో ఉండాలి. రవాణా, ఆబ్కారీశాఖల్లో కానిస్టేబుల్ పోస్టులకు స్థానిక ఓసీ, బీసీ కులాల వారైతే రూ. 800, ఎస్సీ ఎస్టీలైతే రూ. 400, స్థానికేతరులు ఎవరైనా రూ. 800 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఇతర వివరాలన్నీ www.tslprb.in వెబ్సైట్లో పొందుపరిచామని అధికారులు తెలిపారు.