Two Muslim students win Ramayana quiz, say 'all Indians must learn the epics'
mictv telugu

రామాయణం ఈ ముస్లిం విద్యార్థులకు కొట్టినపిండి.. పోటీలో సక్సెస్..

August 8, 2022

హిందువుల పవిత్ర గంథమైన రామాయణంలోని శ్లోకాలను ఇద్దరు ముస్లిం యువకులు చకచకా వల్లెవేస్తున్నారు. కేరళలోని మలప్పులం వాలంచేరిలోని కేకేఎస్ఎం ఇస్లామిక్, ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న మహ్మద్ బాసిత్, అతని స్నేహితుడు మహమ్మద్ జబీర్ ఇద్దరూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన రామాయణం క్విజ్‌లో మొదటి విజేతలుగా నిలిచారు. ముస్లిం మతానికి చెందిన వీరిద్దరూ హిందువులు పవిత్రగ్రంథంగా భావించే శ్రీరాముడి జీవితం ఇతివృత్తాన్ని శ్లోకాల రూపంలో పఠిస్తున్నారు. తుంచతు రామానుజన్ ఎజ్హుతాచన్ రచించిన మళయాళ సంస్కరణ అయిన ఆధ్యాత్మ రామాయణంలోని శ్లోకాలను చదవి అర్థం చేసుకోవడమే కాకుండా వాటి అర్థాలను, సందేహాలను సరళంగా వివరించారు.

వీరిద్దరూ ఇస్లామిక్ కాలేజీలో ఎనిమిదేళ్ల కోర్సు అయిన వాఫీ ప్రొగ్రామ్‌లో ఒకరు ఐదవ, మరొకరు చివరి సంవత్సరం చదువుతున్నారు. గత నెలలో నిర్వహించిన రామాయణ క్విజ్‌లో నిలిచిన ఐదుగురు విజేతలలో వీరు కూడా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా వీరు మీడియా దృష్టిని ఆకర్షించారు. చిన్నప్పటి నుంచి ఇతిహాసం గురించి తెలిసినా, అన్ని ప్రధాన మతాల బోధనలతో కూడిన వాఫీ కోర్సులో చేరి రామాయణం, హిందూమతం గురించి లోతుగా చదవడం, తెలుసుకోవడం ప్రారంభించామని ఈ విద్యార్థులు తెలిపారు. ఏమతం ద్వేషం ప్రోత్సహించదని, శ్రీరాముడి ధర్మం, తండ్రి కోసం రాజ్యాన్ని త్యాగం చేసిన గొప్పతనం తెలుసుకోవడానికి భారతీయులందరూ రామాయణం, మహాభారతాన్ని తప్పక చదవాలని వీరు పిలుపునిచ్చారు.