హైదరాబాద్ రోడ్లపైకి వెళ్లాలంటేనే జనాలు భయపడుతున్నారు. రోడ్డుపై ఎవరు ఎలా వాహనాలపై మృత్యురూపంలో దూసుకువస్తున్నారో తేల్చుకోలేని స్థితి ఏర్పడింది. గతవారం వ్యవధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. చాలా ప్రమాదాలు బాధితుల తప్పు లేకుండానే ఇతరుల తప్పు వల్లే జరుగుతున్నాయి. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్, బంజారాహిల్స్, కూకట్పల్లి, కాప్రా, ఎల్బీనగర్.. వరుస ప్రమాదాల జాబితాలో మరోటి చేరింది. ఈ రోజు తెల్లవారుజామున రాజేంద్రనగర్ సమీపంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్‌లోని నారాయణ కాలేజీ క్యాంపస్ కు చెందిన కొంతమంది విద్యార్థులు స్నేహితుడి పుట్టినరోజు ఉందని రాజేంద్రనగర్ వెళ్లారు. నారాయణ కాలేజీ సిబ్బంది అనుమతి లేకుండా గోడ దూకి వెళ్లారు.
గురువారం అర్థరాత్రి బర్త్‌డే పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆరాంఘర్ చౌరస్తా పిల్లర్ నంబర్ 221 దగ్గర వీరి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులోని ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులును నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న అభిషేక్, విష్ణుగా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.