ఆపదలో ఉన్న వారిని రక్షించబోయిన రెస్క్యూ సిబ్బంది… అనంత లోకాలకు వెళ్లిన హృదయ విషాద సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో చోటు చేసుకుంది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఎంతో మక్కువతో సింగరేణి రెస్క్యూ టీంలో చేరిన ఇద్దరి కార్మికుల కుటుంబాల్లో చీకటి అలుముకుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం కాగా.. దహేగం మండలంలోని పెద్దవాగు పొంగిపొర్లింది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టే క్రమంలో ఐనాంకు చెందిరన గర్భిణీ మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా రెస్క్యూ టీమ్‌లోని సతీష్, రాములు గల్లంతయ్యారు.
దీంతో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి.సంజీవరెడ్డి ఆదేశాల మేరకు రెస్క్యూ స్టేషన్ నుండి రెండు రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. గురువారం తెల్లవారుజామున గల్లంతైన ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీం సభ్యుల మృతదేహాలు లభించినట్టుగా తెలిసింది. దాంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడు సిహెచ్ సతీష్ కి భార్య మమత, కొడుకు రిషిక్, కూతురు క్రీతిహన్సి.. అంబాలా రాముకి భార్య స్పందన, కొడుకు ఉన్నారు.