సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం అయ్యాయి. మండలంలోని గంపులగ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీకి చెందిన వెన్నెల బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులను వేరే బస్సుల్లో పంపించారు.
అనంతరం సూర్యాపేట నుంచి ఏపీఎస్‌ఆర్టీసీకే చెందిన మరో బస్సును రప్పింంచారు. వైర్ల సాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో సాంకేతిక లోపంతో ఆగిపోయిన బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న మరో బస్సుకు కూడా వేగంగా మంటలు వ్యాపించాయి. దీంతో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.