యాదగిరి గుట్టలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రెండంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. మృతులను ఉపేందర్, శ్రీను, దశరథ గౌడ్, శ్రీనాథ్లుగా గుర్తించారు.
యాదగిరి గుట్టలో ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. భవనం ముందు భాగంలో దుకాణాలు నిర్వహస్తుండగా, వెనకవైపు రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇళ్లలో, షాపుల్లో జనం ఉన్నప్పుడే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ భవనాన్ని 30 ఏళ్ల కిందట కట్టారని, కూలిపోడానికి కారలేమిటో సరిగ్గా తెలియడం లేదని స్థానికులు అంటున్నారు.