అమెరికాలో తెలుగువారి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో తెలుగువారి మృతి

September 6, 2021

two Telugu people died in America

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఇడా తుఫాను బీభ‌త్సం సృష్టిస్తోంది. తుఫాన్ ప్ర‌భావంతో వ‌చ్చిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని న‌లుగురు భారతీయ అమెరిక‌న్లు బ‌లికాగా.. వీరిలో ఇద్ద‌రు తెలుగువారు ఉన్న‌ట్లు తెలుస్తోంది. న్యూజెర్సీలోని బ్రిడ్జ్‌వాటర్ టౌన్‌షిప్‌లో సాఫ్ట్‌వేర్ డిజైనర్ అయిన మాల‌తి కంచె (46), సౌత్‌ ప్లెయిన్‌ఫీల్డ్‌లో ధనుష్ రెడ్డి (31) మ‌ర‌ణించిన‌ట్లుగా అధికారులు గుర్తించారు. మృతుల పేర్ల‌ను బ‌ట్టి తెలుగు వారని భావిస్తున్నారు. 

సాఫ్ట్‌వేర్ డిజైనర్ అయిన మాలతి త‌న‌ కుమార్తె(15)తో కలిసి బుధవారం కారులో వెళ్తుండగా వ‌ర‌ద‌ నీటిలో చిక్కుకుపోయారు. కారు నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ల్లి, కూతురు పక్కనే ఉన్న చెట్టును పట్టుకున్నారు. కానీ వరద ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో…చెట్టు కూలిపోయింది. దీంతో మాలతి వ‌ర‌ద‌ ప్ర‌వాహంలో గల్లంతు కాగా.. ఆమె కుమార్తె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. శుక్రవారం మాల‌తి మృతదేహన్ని గుర్తించారు.

మరో ఘ‌ట‌న‌లో వ‌ర‌ద తీవ్ర‌తకు కొట్టుకుపోయి ధ‌నుష్ రెడ్డి అనే వ్య‌క్తి మ‌ర‌ణించారు. ఎనిమిది కిలోమీట‌ర్ల దూరంలో ఆయ‌న మృత‌దేహాం ల‌భ్య‌మైంది. ఇంకో ఘ‌ట‌న‌లో న్యూయార్క్‌లో దామేశ్వర్ రామ్స్ క్రీట్స్ భార్య తారా రామ్స్‌క్రీట్స్, ఆయన కుమారుడు(22)  నిక్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. భార్యను రక్షించేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఫలితం లేకుండా పోయిందని, తన కళ్లముందే వారిద్దరూ కొట్టుకుపోయారని దామేశ్వర్ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఇడా తుపానులో ఇప్పటి వరకు 65 మంది ప్రాణాలు కోల్పోయారు.