అమెరికాలో రెండు కార్లు ఢీకొనడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరి విద్యార్థులతోపాటు, మరోకరు మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి సంఘటన గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇల్లినాయిస్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వారేటౌన్ నుంచి ఈస్ట్ కేప్‌కు వేగంగా వెళుతున్న ఫియట్ కారు అదుపుతప్పి, సెంటర్ లైన్ దాటి పక్కరోడ్డుపైకి దూసుకువెళ్లింది. దీంతో ఆ రోడ్డుపై వస్తున్న టయోటా కారు ఫియట్ కారును ఢీకొంది. ఈ ఘటనలో ఫియట్ కారు నడుపుతున్న డ్రైవర్ మారీ మ్యూనియర్ (32)తోపాటు అందులో ప్రయాణిస్తున్న వంశీ పెచ్చెట్టి (23), టయోటా కారు నడుపుతున్న పవన్ స్వర్ణ (23) అక్కడికక్కడే మృతి చెందారు.
అంతేకాకుండా కారులో ప్రయాణిస్తున్న యశ్వంత్ ఉప్పలపాటి, కాకుమాను కార్తీక్, డోర్న కల్యాణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు కాబండేల్ టౌన్‌లోని సదరన్ ఇలినాయిస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నట్లు ఇల్లినాయిస్ స్టేట్ పోలీసు విభాగం గుర్తించింది.
వీరిలో కల్యాణ్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతుండగా, మిగిలిన వాళ్లంతా కంప్యూటర్ సైన్స్ అభ్యసిస్తున్నారు. తమ బిడ్డలు చనిపోయారని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే, మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లోని ఏఏ జిల్లాలకు చెందిన వారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు పూర్తైన దర్యాప్తు చేస్తున్నారు.