సెంటిమెంట్ డైలాగ్ తో బ్యాంకు దోచేసిన దొంగలు.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

సెంటిమెంట్ డైలాగ్ తో బ్యాంకు దోచేసిన దొంగలు.. వీడియో

November 18, 2022

రాజస్థాన్ లో సెంటిమెంటు డైలాగులతో కట్టిపడేసి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు ఇద్దరు దొంగలు. తమ మాటతో బ్యాంకు సిబ్బందిని కదలకుండా చేసి తాపీగా తమ పని కానిచ్చేశారు. దోపిడీ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో స్థానికంగా సంచలనమైంది. పాలి స్టేట్ బ్యాంకులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం సిబ్బంది బ్యాంకు తెరచి ఎవరి పనుల్లో వారు ఉండగా, మాస్కులు వేసుకున్న ఇద్దరు దుండగులు బ్యాంకులోనికి ప్రవేశించారు. ఒకరి చేతిలో కత్తి ఉంటే మరొకరి చేతిలో తుపాకీ ఉంది.

తుపాకీ దొంగ సిబ్బంది తలపై గురిపెట్టి ‘నీ భార్యపిల్లలపై ప్రేమ ఉంటే, వారితో సంతోషంగా బతకాలి అనుకుంటే కదలకుండా కూర్చోండి. కాదని తెలివి ప్రదర్శిస్తే కాల్చి పడేస్తా’నని సున్నితంగా హెచ్చరించడంతో క్యాషియర్ సహా సిబ్బంది అంతా సైలెంటయిపోయారు. దీంతో కత్తి పట్టుకున్న దుండగుడు క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి రూ. 3.33 లక్షలు తీసుకొని బ్యాగులో పెట్టేశాడు. ముందుగా తుపాకీ దొంగ బయటికి వెళ్లి బైక్ స్టార్ట్ చేయగా, అప్పటివరకు సిబ్బందిని కత్తితో బెదిరించిన దొంగ కాపలా కాశాడు. అనంతరం ఇద్దరూ బైక్ పై పారిపోయారు. వెంటనే తేరుకున్న సిబ్బంది బయటికి వచ్చి దుండగులపై రాళ్లు రువ్వినా అప్పటికే సమయం దాటిపోయింది. ఇద్దరు దుండగులు ఆ గ్యాపులో తుర్రుమన్నారు. పోలీసులు సమాచారం అందుకొని సీసీ కెమెరాలు పరిశీలించి కేసు నమోదు చేశారు.