ఇద్దరు ట్రాన్స్ జెండర్లు తెలంగాణలో కొత్త రికార్డు నెలకొల్పారు. డాక్టర్లు అయిన ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల అనే ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్స్ గా నియమితులయ్యారు. అయితే వీరు ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రూత్ జాన్ పాల్ మాట్లాడుతూ.. ‘2018లో మల్లారెడ్డి కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తయింది. తర్వాత జాబ్ కోసం ప్రయత్నిస్తే 15 ఆసుపత్రులు తిరస్కరించాయి. హిజ్రా కావడం వల్ల తిరస్కరిస్తున్నామని ఎవరూ చెప్పలేదు కానీ, నేను గ్రహించాను.
నా ఐడెంటిటీ బయటపడ్డాక నా విద్యార్హత పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఇది మా కమ్యూనిటీకి గొప్పరోజు’ అని హర్షం వ్యక్తం చేసింది. ప్రాచీ రాథోడ్ కూడా తనకెదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ‘అదిలాబాద్ రిమ్స్ లో ఎంబీబీఎస్ అయ్యాక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేశాను. నా ఐడెంటిటీ తెలిశాక ఉద్యోగం నుంచి తీసేశారు. ట్రాన్స్ జెండర్ డాక్టర్ అని తెలిస్తే వచ్చే రోగులు తగ్గిపోతారని చెప్పేశారు. తర్వాత 2021లో నారాయణ గూడలోని యూఎస్ఏఐడీ ట్రాన్స్ జెండర్ క్లినిక్ మిత్రలో చేరామ’ని వివరించింది. అయితే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం గురించి కూడా వారిద్దరు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ‘ఆసుపత్రికి వచ్చే రోగులు కూడా మాపై వివక్ష చూపించే అవకాశం ఉంది. కానీ, మంచి వైద్యం అందించి వేరొకరికి సిపారసు చేసేలా పని చేస్తామ’ని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. అటు ఈ ఉద్యోగం తమకు మహిళల కోటాలో వచ్చిందని, సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధమన్నారు. దీనిపై ప్రభుత్వానికి రిప్రజెంట్ ఇచ్చామని, అవసరమైతే చట్టపరమైన మార్గాన్ని ఎంచుకుంటామని స్పష్టం చేస్తున్నారు.