Two villages fighting for one buffalo in Anantapur
mictv telugu

దేవర దున్నపోతు పంచాయితీ.. తగ్గేదే లే అంటున్న 2 గ్రామాలు

January 9, 2023

రెండు గ్రామాలు ఓ దున్నపోతు కోసం కొట్లాడుకుంటున్నాయి. దున్నపోతు మాదంటే మాదని పట్టుబడడంతో పోలీసులు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. గ్రామ పెద్దలు కూడా పంతాలకు పోతుండడంతో సమస్య జటిలంగా మారుతోంది. దున్నపోతు లేకుండా దేవర అంటే జాతర జరగదు కాబట్టి రెండు గ్రామాలు ఓ దున్నపోతును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అంనంతపురం జిల్లా కణేజల్లు మండలంలో జరుగుతున్న ఈ పంచాయితీ వివరాలు ఇలా ఉన్నాయి. అంబాపురం, రచ్చుమర్రి అనే రెండు గ్రామాల్లో పదేళ్లకు ఒకసారి ఊరి దేవర జరపడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 17న అంబాపురంలో జాతర జరుగనుండగా, మరో రెండు నెలల్లో రచ్చుమర్రిలో ఊరి దేవర నిర్వహించాలని పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో అమ్మవారి పేరుతో వదిలిన దేవర దున్నపోతు కోసం అంబాపురం గ్రామస్తులు గాలించి కొలగానహళ్లిలో కనిపించిన దున్నపోతును బంధించి తమ గ్రామానికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో రచ్చుమర్రి గ్రామస్తులు ఎంట్రీ ఇచ్చి దేవర దున్నపోతు తమదని వాదించడంతో సమస్య మొదలైంది. తాము వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ నిలదీస్తుండడంతో వివాదం ఇంకా పెరుగుతూ వచ్చింది. రెండు గ్రామాలు పట్టుదలకు పోవడంతో పలుమార్లు పంచాయితీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. చివరికి పోలీసులు వచ్చి నచ్చజెప్పాలని చూసినా రెండు గ్రామాల ప్రజలు మొండి వాదనలకు దిగడంతో పోలీసులు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. పోతు కోసం ఎందాకైనా పోతామంటూ సవాల్ విసురుకుంటున్నారు. అటు పోతును అంబాపురంలో బందుల దొడ్డిలో ఉంచి గ్రామ యువకులు రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. కాగా, జాతర జరిగిన నెల రోజుల తర్వాత అమ్మవారి పేరున మూడు నెలల వయసున్న ఓ దున్నపోతును కొనుగోలు చేసి వదులుతుంటారు. ఈ రెండు గ్రామాలవారు పదేళ్ల క్రితం ఇలా చేయగా, ఒక్క దున్నపోతును పట్టుకుని తమదంటే తమదని తీవ్రంగా వాదించుకుంటున్నారు.