Two women get married in Kadapa district
mictv telugu

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ట్విస్ట్ ఏంటంటే..

August 10, 2022

వాళ్లిద్దరు మేజర్లు.. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ పెద్దలు ఒప్పుకోలేదని తమకు రక్షణ కలిపించాలంటూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇలాంటి కేసుల గురించి చాలానే విని ఉంటాం. ఈ కేసు మాత్రం కాస్త విచిత్రం. పోలీసులను ఆశ్రయించిన జంటలో ఇద్దరూ యువతులే. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వారిలో ఒకరికి ఇంతకుముందే ఓ యువకుడితో పెళ్లైంది. ఈ సంఘటన కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

చెన్నూరు గ్రామానికి ఒక మహిళకు పెండ్లమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట వివాహమైంది. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆ మహిళకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం ఇద్దరు మహిళలు ఇంటి నుంచి పారిపోయి శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు.

మూడు రోజులు అక్కడ ఉండి మంగళవారం వేంపల్లెకి తిరిగొచ్చారు. ఇంటికి వెళ్తే తమను చంపేస్తారన్న భయంతో నేరుగా వేంపల్లె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోలీసులు సమన్వయంతో ఆ ఇద్దరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి.. వారి బంధువులకు ఫోన్ చేసి వాళ్లని పంపించేశారు.