ఇసుకను అక్రమంగా తరలిస్తే రెండేళ్ల జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

ఇసుకను అక్రమంగా తరలిస్తే రెండేళ్ల జైలు శిక్ష

November 13, 2019

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కొనసాగుతోన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష విధించాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. 

andhra pradesh ..

ఇసుక నిల్వ చేసినా అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠినచర్యలు తీసుకునేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ దొరికితే కనీసం జరిమానా రూ.2 లక్షల రూపాయల జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇసుక డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో ఒక వారం రోజుల పాటు ప్రభుత్వంలోని కొన్ని యంత్రాంగాలను రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించినట్లుగా నాని తెలిపారు. ప్రతి రోజు లక్షా యాభైవేల నుంచి రెండు లక్షల టన్నుల వరకు ఇసుక లభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.