మీరు నిజంగానే దేవుళ్లు.. హనీమూన్ రద్దు..   - MicTv.in - Telugu News
mictv telugu

మీరు నిజంగానే దేవుళ్లు.. హనీమూన్ రద్దు..  

April 4, 2020

Two young American doctors spend honeymoon fighting coronavirus

వైద్యో నారాయణో హరి: అంటారు. వైద్యుడు కనిపించే దేవుడు. కరోనా వైరస్ కారణంగా  వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్య కార్మికులకు తీరికలేకుండా పోయింది. తమకు ఏం అయినా పర్వాలేదు అనుకుని విధి నిర్వహణలో తలమునకలై ఉంటున్నారు. ముఖ్యంగా వైద్యులు అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని కరోనా రోగుల బాగుకోసం త్యాగం చేయడం మనం చూస్తున్నాం. వారి సేవలకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి. ఈ నేపథ్యంలో ఓ వైద్యజంట కరోనా రోగుల సేవ కోసం తమ హనీమూన్‌నే వాయిదా వేసుకుని, విధుల్లో చేరిపోయారు. కరోనా రాకముందు వారు తమ హనీమూన్ గురించి ఎన్నో ప్లాన్‌లు వేసుకున్నారు. కానీ, కరోనా మహమ్మారి వారి ఆనందాన్ని ఆవిరి చేసింది. ఆ వైద్య జంట పేర్లు.. డాక్టర్ ఖాసిఫ్ చౌదరి, నైలా షరీన్. ఇటీవలే  వారిద్దరు న్యూజెర్సీలో నిఖా(వివాహం) చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కొన్ని రోజులు గడిపారు. ఈ సమంయలో హనీమూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. 

అంతా రెడీ అవుతున్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి వారికి తెలిసింది. అంతే మరో ఆలోచన లేకుండా ఆ యువ జంట ‌తమ హనీమూన్‌ను రద్దు చేసుకుని, వెంటనే విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. షరీన్ ఇంటర్ మెడిసిన్ చీఫ్‌గా చేస్తుంది. న్యూయార్క్‌లో వివిధ ఆసుపత్రులకు తిరగాల్సి ఉంటుంది. ఇక ఖాసిఫ్ చౌదరి, ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్‌గా పని చేస్తాడు. సెడార్ ర్యాపిడ్స్‌లని మెర్సీ మెడికల్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ యువజంట తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.