జెలెన్‌స్కీని హత్య చేస్తే... మా ప్రణాళిక ఇదీ : అమెరికా - MicTv.in - Telugu News
mictv telugu

జెలెన్‌స్కీని హత్య చేస్తే… మా ప్రణాళిక ఇదీ : అమెరికా

March 7, 2022

gh

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ఇప్పటికే మూడు సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. రష్యా దళాల మొదటి లక్ష్యం నన్ను చంపడమేనంటూ జెలెన్‌స్కీ సైతం కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిజంగా జెలెన్‌స్కీ హత్య జరిగితే తదుపరి ఏం జరుగుతందనే ప్రశ్నకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమాధానమిచ్చారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎదురైన ఈ ప్రశ్నకు బ్లింకెన్  స్పందిస్తూ..‘ ఉక్రేనియన్ల వద్ద ఇందుకు సంబంధించిన ప్రణాళికలున్నాయి. ఒక రోజు క్రితం నేను ఉక్రెయిన్‌లో ఉన్నప్పుడు నా స్నేహితుడు దిమిత్రో కులేబా నాతో చెప్పారు. వాటి గురించి నాకు తెలుసు కానీ, వివరాలు ఇప్పుడు బహిర్గతపరచలేను. ప్రస్తుతం జెలెన్‌స్కీ ప్రభుత్వం బాగా పని చేస్తోంద’ని తెలిపారు. మరోవైపు రష్యాపై వివిధ దేశాలు, సంస్థలు విధించిన ఆర్ధిక ఆంక్షల ప్రభావం చాలా గట్టిగా ఉంటుందనీ, ఆ దేశం నుంచి కనీస వస్తువులను కూడా కొనలేని పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరం చేసిందనీ, ఇది మరి కొంతకాలం కొనసాగే అవకాశాలుండడం మన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాగా, జెలెన్‌స్కీ హత్య జరిగితే సరిహద్దు దేశమైన పోలండ్ నుంచి ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో అమెరికా ఉన్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.