మొన్న బేబీ, నిన్న మోండల్.. నేడు వినోద్.. - MicTv.in - Telugu News
mictv telugu

మొన్న బేబీ, నిన్న మోండల్.. నేడు వినోద్..

September 16, 2019

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది మరుగున పడుతున్న అద్భుతమైన కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. తమ ప్రతిభకు ఇప్పుడు సోషల్ మీడియానే గీటురాయిగా మారిందని చెబుతున్నారు. కొందరు ఎక్కువగా చదువుకోలేకపోయినా వాళ్లలో ప్రతిభ వుంటుంది. అలాంటివాళ్లు చదువురాదని అజ్ఞాతంలోనే వుండిపోతున్నారు. కానీ, ప్రతిభ ఎక్కడున్నా అది వెలుగులోకి వస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఫోన్లలో వైరల్ అయి తమకు ఇష్టమైన పనిని ఆలస్యంగానైనా చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న తెలుగు రాష్ట్రాల్లో తన మధుర గాత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పసల బేబీ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఆమె సినిమాల్లో పాటలు పాడుతోంది. రాణి అనే యువతి తీసిన చిన్న వీడియో బేబీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

అలాంటిదే మరో సింగర్ రాణు మోండల్ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌లో యాచిస్తూ కడుపు నింపుకునే ఆమె లతా మంగేష్కర్ పాడిన పాట పాడింది. దీనిని అతీంద్ర చక్రవర్తి అనే ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఇప్పుడు బాలీవుడ్ గాయనిగా మన కళ్లముందు వుంది. దెబ్బకు ఆమె కష్టాలన్నీ తీరిపోయి.. జీవితం అంతా మారిపోయింది. అలాంటి మరో గాయకుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. అతడు అచ్చం కుమార్ సానులానే పాడుతున్నాడు. 1990లో వచ్చిన ‘ఆషికీ’ సినిమాలో ‘నజర్ కే సామ్నే.. జిగర్ కే పాస్’ పాటను చక్కగా ఆలపించాడు. లక్నోలో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్ చాలా చక్కగా ఆలపించాడు. కుమార్ సాను గాత్రంలో వుండే మాధుర్యం, ఆ స్టైల్ ఎక్కడా మిస్ అయినట్టు కనిపించదు. కళ్లు మూసుకుని వింటే ఆశికీ సినిమాలోని పాటే వింటున్న అనుభూతి కలుగుతుంది. 

ఉబర్‌లో ప్రయాణిస్తున్న ప్రియాన్షు అనే ప్రయాణికుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అతను పాడిన తీరు చాలా అద్భుతంగా వుందని.. డెక్ ఆన్ చేయకుండానే అతను పాడిన పాటతో నా ప్రయాణం మరిచిపోలేని మ్యూజికల్ రైడ్ అయిందని ప్రియాన్షు స్టేటస్ పెట్టాడు. అతని పాట విని చాలామంది బాలీవుడ్‌కు మరో కుమార్ సాను దొరికాడని కామెంట్లు చేస్తున్నారు.