కరోనా వైరస్ ఈ ప్రపంచానికి ఎన్నో విషాదాలను, విచారాలను మిగిల్చింది. మరోపక్క కొత్త పాఠాలు, మరెన్నో గుణపాఠాలు నేర్పింది. అంతకుమించి ఎన్నో జాగ్రత్తలు నేర్పింది. మునుపటిలా దేన్ని పడితే దానిని చేతితో తాకొద్దు, చేతితో తాకాల్సిన వస్తువులను కాలితో తాకేలా చేసింది. ముఖాలకు మాస్కులు, శానిటైజర్లు, ఆహారంలో ప్రొటీన్, విటమిన్ల సమతుల్యతను చూసుకోవడం వంటివి ప్రజలు బాగా చూసుకుంటున్నారు. బయట ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏమాత్రం అజాగ్రత్తగా వ్వవహరించడంలేదు. ఏ ఒకరిద్దరు తప్పితే ప్రజలు కరోనా విషయంలో అప్రమత్తంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. ‘మాస్క్ వెరిఫికేషన్ ఫీచర్’ అనే ఈ విధానం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుచనున్నట్టు సంస్థ వెల్లడించింది. దీంతో గతంలో మాస్క్ ధరించకుండా ఉబెర్‌లో ప్రయాణించిన వారికి యాప్ ఆ సంగతిని గుర్తుచేస్తుంది. తదుపరి వారు ఉబెర్ రైడ్‌ను బుక్ చేసుకోవాలంటే.. మాస్క్ ధరించి ఉన్న సెల్ఫీని పంపవలసి ఉంటుందని సంస్థ పేర్కొంది. వినియోగదారుడు మాస్క్ ధరించనపుడు.. ఆ విషయాన్ని డ్రైవర్ తన యాప్‌లో నమోదు చేస్తాడు. ఆ సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుందని తెలిపారు.
ఈ విషయమై ఉబెర్ ఇండియా సీనియర్ డైరక్టర్ సచిన్ కన్సాల్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నెలల తరబడి మూతపడ్డ వాహన సేవలు.. దేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. మేమెప్పుడూ డ్రైవర్, ప్రయాణికుడు ఇరువురి భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాం. వినియోగదారులు తెలిసో తెలియకో అప్పుడప్పుడు మాస్కులు ధరించడంలేదు. ఈ నేపథ్యంలో వారికి భద్రతా నిబంధనలను గుర్తు చేయటం మా బాధ్యతగా భావించి ఈ చర్య తీసుకున్నాం. ఈ విధానం అమెరికా, కెనడాల్లో సెప్టెంబర్ నుంచే అమలులో ఉంది. డ్రైవర్, వినియోగదారుడు ఇద్దరూ బాధ్యతాయుతంగా ఉంటేనే కరోనా వ్యాప్తిని నివారించగలం. అంతేకాకుండా డ్రైవర్, ప్రయాణికుడు ఇద్దరిలో ఎవరు మాస్క్ ధరించకపోయినా, రెండవ వారు ఏ జరిమానా లేకుండానే ప్రయాణాన్ని రద్దు చేసుకోవచ్చు. మా డ్రైవర్లకు 30 లక్షల మాస్కులు, రెండు లక్షల శానిటైజింగ్ బాటిల్స్ ఉచితంగా అందజేస్తున్నాం’ అని సచిన్ కన్సాల్ తెలిపారు.