రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మకు మద్దతుగా వాట్సప్‌లో ఆమె ఫోటోను స్టేటస్ గా పెట్టాడు ఓ టైలర్. అయితే దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేశారు. సోమవారం మధ్యాహ్నం.. దుస్తులు కుట్టించుకోవాలనే నెపంతో కత్తులతో అతడి షాప్ లోకి ప్రవేశించిన ఆ ఇద్దరూ పట్టపగలే అతడిని దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగని హంతకులు తలను నరికి వీడియో కూడా తీశారు. మృతుడు కన్హయ్య లాల్‌గా గుర్తించారు పోలీసులు.
ఉదయ్‌పూర్‌లోని భూత్ మహల్‌లోని ధన్ మండి ప్రాంతంలో ‘సుప్రీమ్ టైలర్స్’ పేరుతో టైలర్ షాప్‌ను నడుపుతున్నాడు కన్హయ్య లాల్. సుమారు 10 రోజుల క్రితం, బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశాడు. అప్పటి నుంచి ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అతడిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులతో భయపడ్డ కన్హయ్య లాల్.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీనికి సంబంధించి పోలీసులు సీరియస్‌గా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతడిని కొన్ని రోజులు షాప్ తెరవకుండా ఉండాలని చెప్పినట్టు కన్హయ్య బంధువులు చెబుతున్నారు. సోమవారం నాడు షాప్ ను తెరిచిన రోజే మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో.. రియాద్ అనే వ్యక్తి ఒకరితో పాటు మరొకరు మోటార్‌సైకిల్‌పై వచ్చి కన్హయ్య లాల్ ను హత్య చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని.. దోషులను వదిలిపెట్టబోమని అన్నారు.