బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ దేశం అవమానాన్ని చవిచూడాల్సి వచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. ఔరంగాబాద్ లో బుధవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న సీఎం ఉద్దవ్ ఠాక్రే.. గత కొన్ని వారాలుగా వలస కార్మికులు, కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్న కాశ్మీర్ లో హనుమాన్ చాలీసా పఠించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ‘‘మీకు ధైర్యం ఉంటే వెళ్లి కశ్మీర్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి’’ అని తెలిపారు. హిందుత్వ కోసం శివసేన ఏమి చేసిందో, బీజేపీ ఏమి చేసిందనే దానిపై ముంబైలో బహిరంగ చర్చ జరగాలని ఠాక్రే అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలో బీజేపీ లౌడ్స్పీకర్లు, ఇతర విషయాలపై వివాదాలు సృష్టిస్తోందని థాకరే ఆరోపించారు. దివంగత సేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే చేసిన సాయం వల్లనే శివసేన చిరకాల మిత్రపక్షమైన బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోగలిగిందని థాకరే అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శివలింగంపై చేసిన వ్యాఖ్యను థాకరే స్వాగతించారు. ఈ సందర్భంలోనే ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా తప్పకుండా మారుస్తానని ఉద్దవ్ ఠాక్రే మరో సారి స్పష్టం చేశారు.