షిర్డీ-పత్రి వివాదానికి తెర.. ఇకపై అలా పిలవరంట.. - MicTv.in - Telugu News
mictv telugu

షిర్డీ-పత్రి వివాదానికి తెర.. ఇకపై అలా పిలవరంట..

January 20, 2020

Shiridi.

షిర్డీ-పత్రి వివాదంపై శివసేన మెట్టు దిగింది. సాయిబాబా జన్మస్థలంపై చెలరేగిన రగడపై ఆ పార్టీ నేత కమలాకర్ కోతే స్పందిస్తూ.. ‘బాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనేది లేదు. కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నాం’ అని వెల్లడించారు. సోమవారంనాడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే షిర్డీ ట్రస్టు ప్రతినిధులతో మావేశమయ్యారు. సమావేశం అనంతరం కమలాకర్ కోతే మీడియాతో మాట్లాడారు. షిర్డీ సాయిబాబా జన్మస్థలంగా పత్రిని ఇక ముందు పేర్కొనరాదని సమావేశం నిర్ణయించినట్టు తెలిపారు. కొత్త వివాదాలకు ముగింపు.. ఇకపై షిర్డీలో ఎలాంటి వివాదాలు ఉండవని పేర్కొన్నారు.  

సాయిబాబా జన్మస్థలమైన పత్రి గ్రామాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇటీవల ప్రకటించడంతో వివాదం చెలరేగింది. దీనిపై షిర్డీ గ్రామ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. బాబా జన్మస్థలంగా పత్రిని ప్రకటించి, అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాశస్త్యం తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. షిర్డీ నిరవధిక బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. పత్రిని బాబా జన్మస్థలంగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనంత వరకు తాము వెనక్కి తగ్గేదిలేదని షిర్డీవాసులు  స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పట్టుదల మరింత వివాదానికి దారి తీస్తుందని భావించిన ఉద్ధవ్ థాకరే.. ఆలయ ట్రస్టు ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీంతో పరిస్థితి చల్లబడింది.