శివసేన ఎమ్మెల్యేల అనూహ్య తిరుగుబాటుతో షాక్లో ఉన్న మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకి మరో భారీ షాక్. శివసేన పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు సీఎం షిండేతో టచ్లో ఉన్నారని, రెబల్ వర్గంలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 12 మంది శివసేన ఎంపీలు సీఎం ఏక్నాథ్ షిండేతో టచ్లో ఉన్నారని, వారు లోక్సభలో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర కేబినెట్ గురించి బీజేపీ అధినాయకత్వంతో చర్చించేందుకు సీఎం ఏక్నాథ్ షిండే ఢిల్లీకి వెళ్లిన సమయంలోనే… శివసేనకు చెందిన 12 మంది ఎంపీలకు ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించడం గమనార్హం. ఈ ఎంపీలంతా షిండే వర్గానికి మద్దతు తెలుపుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ 12 మంది శివసేన ఎంపీలు.. సీఎం ఏకనాథ్ షిండేతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి.. షిండేకు తన మద్దతు ప్రకటించే అవకాశముంది. ఈ పరిణామంతో శివసేన శాసనసభా పక్షం చీలిక తర్వాత.. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ కూడా చీలిక బాటలో పయనిస్తున్నట్లు మహారాష్ట్ర పొలిటికల్ కారిడార్లో టాక్ వినిపిస్తుంది. లోక్సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు. ఏక్నాథ్ షిండేతో సోమవారం వర్చువల్ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తమని ప్రత్యేక బృందంగా స్పీకర్ గుర్తించిన తర్వాత.. శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం.
గత వారం పార్టీ ఎంపీలతో సమావేశమైన ఉద్ధవ్ థాక్రే.. తమ భాగస్వామ్య పార్టీలతో సంబంధాలు తెంచుకుని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మూకు మద్దతు ప్రకటించారు. దీంతో థాక్రేపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు.