‘మహా’బలం నిరూపించుకున్న ఉద్ధవ్.. 169 ఓట్లు - MicTv.in - Telugu News
mictv telugu

‘మహా’బలం నిరూపించుకున్న ఉద్ధవ్.. 169 ఓట్లు

November 30, 2019

అనుమానాలు, ఆశనిరాశల మధ్య ఊగిసలాడిన మహారాష్ట్ర సర్కారు బలనిరూపణ వ్యవహారం సజావుగా సాగింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల కొత్త ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేలు జైకొట్టారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా 169 ఓట్లు పడ్డాయి. నలుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. బలపరీక్షకు ముందే 105 మంది బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్ చేశారు. దీంతో పరీక్షలో సర్కారు సులువుగా గట్టెక్కింది. 

uddhav Thackeray.

మొత్తం 288 సీట్లు ఉన్న అసెంబ్లీలో మెజార్టీకి 145 మంది మద్దతు సరిపోతుంది. బలపరీక్ష సందర్భంగా అధికార, విపక్షాల మధ్య చిన్న వివాదం రేగింది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్ణవీస్ మాట్లాడుతూ.. ప్రొటెం స్పీకర్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బల పరీక్షకు ముందే ఈ నియామకం జరిపారని మండిపడ్డారు. అయితే తనను గవర్నరే నియమించారని ప్రొటెం స్పీకర్ దిలీప్ పాటిల్ వివరించారు. బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. తర్వాత ప్రొటెం స్పీకర్ విశ్వాస పరీక్షకు ఆదేశించగా కమలనాథులు బయటికి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మొదట ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దీనికి అభ్యంతరం చెప్పడంతో బలం లేక గద్దె దిగడం తెలిసిందే.