పీఠమెక్కిన ఉద్ధవ్ ఠాక్రే.. హాజరైన ఫడ్ణవీస్  - MicTv.in - Telugu News
mictv telugu

పీఠమెక్కిన ఉద్ధవ్ ఠాక్రే.. హాజరైన ఫడ్ణవీస్ 

November 28, 2019

uddhav Thackeray takes oath as chief minister of Maharashtra 

మహారాష్ట్ర రాజకీయాలు దాదాపు నెల రోజుల గొడవల తర్వాత  ఒక కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ.. ఆయనతో ప్రమాణం చేయించారు. దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఉద్ధవ్.. జనానికి తలొంచి అభివాదం చేశారు.  పగ్గాలు చేపట్టడానికి ముందు ఉద్ధవ్.. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నమస్కరించారు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పీఠమెక్కిన ఉద్ధవ్ రాష్ర్టానికి 18వ ముఖ్యమంత్రి

ఆయనతోపాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ ముండే, సుభాష్‌ దేశాయ్‌, ఎన్సీపీ నుంచి చగన్‌ భుజ్జల్‌, జయంత్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌, నితిన్‌​ కేత్‌లు ప్రమాణం చేశారు.  ప్రమాణానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్ణవీస్, ఎన్సీపీ చీఫ్‌ శదర్‌ పవార్‌, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్ నాథ్, డీఎంకే నేత స్టాలిన్ తదితర దిగ్గజాలు హాజరయ్యారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీ అవతరించడం తెలిసిందే. సీఎం పీఠంపై కన్నేసిన శివసేన కమలనాథులతో దశాబ్దాల మైత్రికి జెల్లకొట్టింది. తర్వాత ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో దేవేంద్ర ఫడ్ణవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించకపోవడంతో బలం నిరూపించుకోలేక రాజీనామా చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో ఉద్ధవ్ ఎట్టకేలకు ఆశ నెరవేర్చుకున్నారు.