మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే! అప్పుడే కేసు కూడా! - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే! అప్పుడే కేసు కూడా!

November 22, 2019

 Uddhav Thackeray To  become Maharashtra Government chief .

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం కొలిక్కి వస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు సూత్రప్రాయ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ రోజు జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయన ‘సేనా’ధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే మీడియాకు తెలిపారు. ఉద్ధవ్‌ ఠాక్రేకు సీఎం పదవిని కట్టబెట్టాలని సమావేశంలో అంగీకరించిన్లు శివసేన పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా ప్రకటన చేశారు. ‘మహారాష్ట్రకు కాబోయే సీఎం ఉద్దవ్‌ ఠాక్రేనే. మూడు పార‍్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్టీల ఎమ్మెల్యేలు లేఖపై సంతకం కూడా చేశారు. ఉమ్మడి అజెండాపై మరింత స్పష్టంత కోసం  చర్చలు సాగిస్తాం’ అని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ ఇంతవరకూ దీనిపై నేరుగా ప్రకటనేదీ చేయలేదు. 

గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి సంఖ్యా బలం లేకపోవడంతో సేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలుస్తున్నాయి. దీనికోసం పులి పార్టీ బీజేపీతో దశాబ్దాల సంబంధాన్ని కూడా తెగ్గొట్టుకుంది. ప్రతిపాదిత ఒప్పందం కింద.. శివసేనకు సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. కీలక మంత్రి పదవులు మూడు పార్టీలు పంచుకుంటాయని, బలాన్ని బట్టి కేబినెట్ పోస్టుల పంపకం ఉంటుందని తెలుస్తోంది.

 కాగా, ఉద్ధవ్ ఠాక్రే ఇంకా అధికారంలోకి రాకముందే కేసు నమోదైంది. ఆయన బీజేపీతో చెలిమిని వదులుకుని ఓటర్లకు నమ్మక ద్రోహం చేశారంటూ రత్నాకర్ చౌరే అనే న్యాయవాది కేసు పెట్టారు. అందులో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్, శివసేన నేత ప్రదీప్ జైశ్వాల్ పేర్లను కూడా చేర్చారు.