మహారాష్ట్ర సీఎం రాజీనామా! సంక్షోభానికి తోడు కరోనా.. - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర సీఎం రాజీనామా! సంక్షోభానికి తోడు కరోనా..

June 22, 2022

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. అధికార మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం గద్దె దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శివసేన సారథ్యంలో సర్కారుకు షాకిస్తూ ఆ పార్టీ రెబల్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని అస్సాంలో క్యాంప్ పెట్టారు. తన వెంట రెండింట మూడొంతుల మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. తన బలాన్ని ప్రదర్శిస్తూ ఆయన బుధవారం ఫొటోలు విడుదల చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

ఇదే సమయంలో ‘అసెంబ్లీ రద్దు’ గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. విధాన సభ రద్దు దిశగా సాగుతోంది’’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రి, ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విటర్‌ బయో నుంచి ‘రాష్ట్ర మంత్రి’ అనే పదాన్ని తొలగించారు. ఇది కూడా అసెంబ్లీ రద్దు ఊహాగానాలను బలపరుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయడమే సరైన నిర్ణయమని శివసేన భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై చర్చించేందుకే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే. ఈ సాయంత్రం 5 గంటలకు కేబినెట్‌ భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. భేటీ అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్‌ కమలం’ వల్లే మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం కూలుతోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో.. సీఎం ఉధ్దవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆ రాష్టర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీ కాసేపటి క్రితం మొదలైంది. కరోనా బారినపడ్డ సీఎం ఉద్ధవ్ థాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.