గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో కాంతార మూవీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో దేవుడి ఆజ్ఞను ధిక్కరించిన వ్యక్తి కోర్టు మెట్లపైనే ప్రాణాలు కోల్పోతాడు. అయితే నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. దేవుడి ఆజ్ఞను ధిక్కరించిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి దగ్గర ఉన్న పడుబిద్రి అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పడుబిద్రి ప్రాంతంలో ఉన్న జారందాయ దేవాలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది.ఈ ఆలయ నిర్వహణ విషయంలో రెండు కమిటీల మధ్య గొడవ జరిగింది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యత బంట సేవా సమితి అనే కమిటీ చూసుకునేది. ఈ కమిటీకి ప్రకాశ్ శెట్టి అనే వ్యక్తి ఛైర్మన్ గా ఉండేవాడు. కొత్త కమిటీ ఏర్పడగానే ప్రకాశ్ శెట్టి తన పదవిని కోల్పోయాడు. అంతవరకు పదవిలో ఉండి.. ఒక్కసారిగా అధికారం లేకపోయే సరికి తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా అధికారం చెలాయించాలని.. ఐదుగురు వ్యక్తులతో మరో కమిటీ ఏర్పాటు చేశాడు. అనంతరం ఆ గుడికి ‘ప్రధాన పూజారి(గురికారా)’ని నియమించాడు. ‘దైవస్థాన’పై హక్కు తనకే ఉందని అధికారం చలాయించడానికి ప్రయత్నించాడు.
ఆ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన భూత కోల(నేమోత్సవం) నిర్వహించాల్సి ఉండగా దానిని నిలుపుదల చేస్తూ ప్రకాశ్ శెట్టి, అతడు నియమించిన ఆలయ ప్రధాన పూజారి కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చాడు. ఆ నేమోత్సవాన్ని ఎలాగైనా ఆపాలని డిసెంబర్ 23న స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగానే డిసెంబర్ 24 అకస్మాత్తుగా కిందపడి చనిపోయాడు ఆలయ ప్రధాన పూజారి. కొన్నిరోజుల క్రితమే ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం వల్లే జయపూజారి చనిపోయాడని అంటున్నారు కొందరు. కొత్త కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమాల విషయంలో అతడు జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే ఈ తరహా ఘటన జరిగేది కాదని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.