ఆధార్‌పై కీలక నిర్ణయం.. ఇక నుంచి చావులు కూడా నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్‌పై కీలక నిర్ణయం.. ఇక నుంచి చావులు కూడా నమోదు

June 15, 2022

ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. అప్పుడే పుట్టిన నవ జాత శిశువులకు తాత్కాలిక ఆధార్ కేటాయించబోతోంది. వారికి ఐదేళ్లు వచ్చాక శాశ్వత ఆధార్ నెంబర్, మేజర్లయిన తర్వాత బయోమెట్రిక్ సేకరణ వంటివి చేయనుంది. దీని కోసం రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. దీంతో పాటు వ్యక్తి మరణించిన వెంటనే అతని వివరాలు ఆధార్ పోర్టల్‌లో నమోదయ్యేలా తగిన చర్యలు తీసుకోనుంది. మనిషి పుట్టిన తేదీ దగ్గర నుంచి చనిపోయే తేదీ వరకు వివరాలను సేకరించడం వలన ఆ వ్యక్తి జీవిత కాలం ఎంత అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగులైతే పింఛను ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయనేది వారి ఆలోచన. కరోనా లాక్‌డౌన్‌, తర్వాత పరిస్థితుల్లో అనేక మంది చనిపోగా, ఆ వివరాలు పోర్టల్‌లో నమోదు కాలేదు. వారి బ్యాంక్ అకౌంట్లు, రావాల్సిన పింఛన్లు యథావిధిగా వచ్చాయి. అంతేకాక, చనిపోయిన వారి ఆధార్, బ్యాంకు అకౌంట్లు ఆక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డెత్ రిజిస్ట్రేషన్ డేటాబేస్‌తో చనిపోయిన వారి ఆధార్ నెంబర్లను లింక్ చేయడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డేటాబేస్‌లతో లింక్ చేయడం ద్వారా ఇప్పటివరకు ఉన్న లొసుగులను తొలగించడం సాధ్యపడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.