గర్బా డ్యాన్స్‌లో దూరి అల్లరి.. 8 మంది ముస్లింల అరెస్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

గర్బా డ్యాన్స్‌లో దూరి అల్లరి.. 8 మంది ముస్లింల అరెస్ట్..

October 1, 2022

ఉత్తర భారతంలో గార్బా డ్యాన్స్‌కు ఉన్న క్రేజే వేరు. పండగల్లో, వేడుకల్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి డ్యాన్స్ కూడా ఇప్పుడు వివాదాలకు కేంద్రమైంది. మధ్యప్రదేశ్‌లో దసరా సందర్భంగా నిర్వహించే గర్బా నాట్యంలో చొరబడి నానా యాగీ చేసిన 8 మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఫోటోలు తీసుకుంటూ, హిందూ యువతులపై చిలర్ల కామెంట్లు చేశారని ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో డాన్సులో హైందవేతరులు పాల్గొనకూడదని ఓ నిషేధ బ్యానర్ కనిపించింది. ఉజ్జయిని జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. నానాఖేడా పట్టణంలోని సంస్కృతి సమితి గార్బా నృత్యాన్ని ప్రదర్శించింది. ‘‘గర్బాలోకి హైందవేతరులకు ప్రవేశం లేదు’’ అని రాసిన పోస్టర్‌ను ఆ ప్రాంతంలో అతికించారు. అంతేకాకకుండా అక్కడికి వచ్చిన వారందరి ఐడెంటిటీ కార్డులు పరిశీలించి కుంకుమ బొట్లు పెట్టారు.

దీనిపై దుమారం రేగడంతో సంస్థ అధ్యక్షుడు బహదూర్ సింగ్ రాథోడ్ వివరణ ఇచ్చారు. హిందూయేతరులు గర్బాలోకి చొరబడి నానా అల్లరి చేస్తున్నారని, మంచి సంప్రదాయం భ్రష్టుపట్టకుండా కాపాడుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉజ్జయినితపాటు నర్మదా పురంలోని సమర్పణ్ వెల్ఫేర్ సొసైటీ కూడా ఇలాంటి నిషేధం పెట్టింది. సంప్రదాయ దుస్తుల్లోనే గర్బా నృత్యం చేయాలని స్పష్టం చేసింది. నృత్యానికి హాజరయ్యేవారి ఐడెంటిటీ కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా నిర్వాహకులకు చెప్పారు.