ఫ్రెండుకోసం 6 నెలలుగా టెంటులోనే.. రూ.71 లక్షలు సంపాదించి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రెండుకోసం 6 నెలలుగా టెంటులోనే.. రూ.71 లక్షలు సంపాదించి..

October 20, 2020

UK: 10-year-old Sleeps In Tent For Over 200 Days, Raises £75k For Medical Centre

పిల్లలకు లోకం తెలియదు అంటారు. కానీ, కొందరు పిల్లలు చేసే పనులను చూస్తే లోకం వారికే ఎక్కువ తెలుసు అనిపిస్తుంది. అలాంటి పిల్లల్ని చూసి పెద్దలు నేర్చుకోవాల్సి వస్తుంది. చిన్న వయసులోనే పరిపక్వత చూపిస్తారు. మనస్ఫూర్తిగా పనిచేసి ఎందరి మన్ననలో పొందుతుంటారు. చిన్న వయసులో లోకానికి పెద్ద పాఠాలను బోధిస్తుంటారు. అలాంటి ఆణిముత్యాలను కనడం తమ అదృష్టంగా భావిస్తారు కన్నవారు. ఇప్పుడీ పదేళ్ల బాలుడి కన్నవారు కొడుకుని చూసి అలాగే పొంగిపోతున్నారు. ఇంతకీ వారి కొడుకు ఏం చేశాడంటే.. ఒంటరిగా ఇంటి ఆవరణలో ఉన్న టెంటులోనే పడుకుంటున్నాడు. ఇల్లు ఉండగా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు నెలలు నుంచి అతడు ఆ టెంటులోనే ఉంటున్నాడు. కేవలం భోజనం చేయడానికి, కాలకృత్యాలను తీర్చుకోవడానికి మాత్రమే ఇంట్లోకి వెళ్లేవాడు. ఇదంతా చనిపోయిన తన ఫ్రెండ్ కోసం చేస్తున్నాడు. యూకేకు చెందిన ఆ బాలుడి పేరు మ్యాక్స్ వూసీ. అతని స్నేహితుడు అంటే.. అతడి వయస్సే ఉంటుందని అనుకుంటారు. కానేకాదు.. ఆ బాలుడి స్నేహితుడి వయసు 74 ఏళ్లు. అంటే బాలుడి కన్నా అతని స్నేహితుడు రిక్ 64 ఏళ్లు పెద్దవాడు. స్నేహానికి వయస్సుతో పనేముందని భావించినట్టున్నారు వారు. 

అయితే ఇటీవల రిక్ అనారోగ్యంతో చనిపోవడంతో మ్యాక్స్ చాలా బాధపడ్డాడు. రిక్ కొన్నాళ్ల కిందట మ్యాక్స్‌కు టెంటును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ టెంటుతో నువ్వు అడ్వెంచర్ చేయాలని చెప్పాడు. అది చూడకుండానే రిక్ చనిపోయాడు. దీంతో మ్యాక్స్ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఆ టెంటులోనే మాకాం పెట్టారు. మార్చి 28 నుంచి ఆ టెంటులోనే నివాసం ఉంటున్నాడు. మ్యాక్స్ చేస్తున్న పనికి తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పలేదు. 

అలా టెంట్‌లో కుర్చోవడం ద్వారా మ్యాక్స్ నిధులు సమకూర్చాడు. సుమారు 200 రోజులు అందులోనే ఉంటూ.. 75 వేల పౌండ్లు ( సుమారుగా రూ.71 లక్షలు) సంపాదించాడు. సమకూర్చుకున్న ఆ మొత్తాన్ని మ్యాక్స్‌కు వైద్యం అందించిన నార్త్ డెవాన్ ఆసుపత్రికి  విరాళంగా అందించాడు. ‘నా స్నేహితుడు రిక్‌ ఆఖరి రోజులు డెవాన్ ఆసుపత్రిలోనే గడిపాడు. అతడిని బతికించేందుకు వైద్యులు ఎంతో శ్రమించారు. రిక్ తరహా రోగులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, సేవల కోసమే ఈ నిధులను రిక్‌కు గుర్తుగా ఆసుపత్రికి దానం ఇచ్చాను. మరో ఏడాదిపాటు నేను ఆ టెంటులోనే ఉంటాను. గత ఆరు నెలల్లో వానలు కురుస్తుండటంతో సుమారు 5 టెంట్లను మార్చాను. నేను టెంటులో కుర్చోవడం వల్ల అంత మొత్తం వస్తుందని అస్సలు ఊహింలేదు’ అని మ్యాక్స్ తెలిపాడు. కాగా, మ్యాక్స్ చేసిన పనిని నెటిజనులు వేనోళ్ల మెచ్చుకుంటున్నారు. వయస్సు చిన్నదైనా అతడి మనసు మాత్రం ఎంతో ఉన్నతమైంది అని అంటున్నారు.