అనిల్ అంబానీకి షాకిచ్చిన లండన్ హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

అనిల్ అంబానీకి షాకిచ్చిన లండన్ హైకోర్టు

May 23, 2020

Anil Ambani.

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీకి లండన్ హైకోర్టు షాక్ ఇచ్చింది. చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 700 మిలియన్ల డాలర్లు(రూ.5,440 కోట్లు) 21 రోజుల్లోనే చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశించింది. చైనాకు చెందిన కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా సహా మరో మూడు బ్యాంకుల నుంచి రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కోసం 2012లో అనిల్ అంబానీ అప్పు తీసుకున్నారు. 

అప్పుడు అనిల్ అంబానీ తన వ్యక్తిగత పూచీకత్తుతో లోన్ పొందారని న్యాయమూర్తి వెల్లడించారు. అయితే, అనిల్ అంబానీ వాదన వేరేలా ఉంది. తన వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టలేదని.. తన ఆస్తి విలువ జీరో ఉందని తెలిపారు. కాగా, కోర్టు 21 రోజుల గడువు ఇవ్వడంతో.. అనిల్ అంబానీ ఏం చేస్తారనేది చూడాలి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. తన సోదరుడు ముఖేష్ అంబానీ.. అనిల్ అంబానీ బకాయిలు చెల్లించడంతో జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న విషయం తెలిసిందే. కాగా, అనిల్ అంబానీ యెస్ బ్యాంక్ నుంచిపెద్ద ఎత్తున రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో దీనిపై ఆయనకు ఈ ఏడాది మార్చిలో నోటీసులు ఇచ్చారు. ముంబై కార్యాలయానికి రావాలని సూచించింది. అయితే అనిల్ అంబానీ మాత్రం ఆరోగ్య కారణాలరీత్యా మినహాయింపు ఇవ్వాలని కోరారు.  అంబానీ గ్రూప్ కంపెనీలు యెస్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.