UK: Man goes to 67 pubs in 17 hours to raise money for dog shelter
mictv telugu

ఒక్కరోజులో 75 పబ్బుల్లో తాగాడు.. కారణం కుక్క చావు

September 23, 2022

ప్రాణంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క క్యాన్సర్ బారిన పడి చనిపోవడం.. అతణ్ని చాలా బాధించింది. అప్పటి నుంచి తనకు వీలైనన్ని కుక్కలను రోగాల నుండి కాపాడాలనుకున్నాడు. అందుకు చాలా డబ్బు అవసరం కాబట్టి విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు. బ్రిటన్‌కు చెందిన నాథన్ క్రింప్(22).. తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో కుక్కల కోసం ఒక షెల్టర్ అయితే ఏర్పాటు చేయగలిగాడు కానీ.. మిగతా అవసరాలను విరాళాలతో పూర్తి చేద్దామనుకొని… ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ నెల 17న బ్రిటన్‌లోని పబ్బులకు వెళ్లి విరాళాలు సేకరిస్తానని, ఎవరికి తోచిన విరాళాలు వాళ్లు ఇవ్వాలని కోరాడు.

ఈ విరాళాల సందర్భంగా అతడు కుక్కను పోలిన కాస్ట్యూమ్స్ ధరించాలని సిద్దమయ్యాడు. అలాగే అంతకుముందు గ్యారెత్ ముర్ఫి అనే వ్యక్తి సాధించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేయాలనుకున్నాడు. గ్యారెత్ గతంలో 24 గంటల్లో 54 పబ్బులు తిరిగి మద్యం తాగాడు. దీన్ని అధిగమించాలని ఈ నెల 17న బ్రిటన్‌లోని పబ్బులు తిరగడం ప్రారంభించాడు. ఒక పబ్బులో మద్యం.. మరో పబ్బులో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ తాగాడు. ఆల్కహాల్‌కు, ఆల్కహాల్‌కు మధ్యలో చిన్న విరామం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేశాడు. అలా మొత్తానికి 17 గంటల్లోనే 67 పబ్బులు తిరిగాడు. దీంతో పాత రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, మొత్తం 24 గంటల్లో 75 పబ్బుల్లో డ్రింక్ తాగినట్లు అతడి సన్నిహితులు చెబుతున్నారు. కుక్కల మీద ప్రేమతో, వాటిని సంరక్షించేందుకు నాథన్ క్రింప్ చేసిన సాహసం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.