UK PM Election Results Live Updates: Liz Truss Is The New UK PM
mictv telugu

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌.. రిషి సునాక్‌పై భారీ మెజారిటీ

September 5, 2022

బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై ఆమె గెలుపొందారు. బోరిస్ జాన్సన్ స్థానంలో ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నెల రోజులకుపైగా సుదీర్ఘంగా సాగిన బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలను సోమవారం వెల్లడించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ట్రస్‌‌వైపు మొగ్గుచూపారు. సునాక్‌పై ట్రస్ ఏకంగా 20వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురేశారు. ఈ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునాక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 21వేల ఓట్ల తేడాతో సునాక్‌పై లిజ్‌ పైచేయి సాధించారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్‌ ట్రస్‌ తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు. సర్వేల అంచనాలను నిజం చేస్తూ మార్గరెట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా లిజ్‌ రికార్డు సృష్టించారు.

విజ‌యం సాధించిన లిజ్ ట్ర‌స్ ఇప్పుడు ఆ దేశ ప్ర‌ధాని కానున్నారు. గెలుపు త‌ర్వాత క్వీన్ ఎలిజ‌బెత్ సెంట‌ర్ 2 ఆడిటోరియం నుంచి లిజ్ ట్ర‌స్ ప్ర‌సంగించారు. టోరీ నాయ‌క‌త్వ రేసులో పాల్గొన్న నేత‌లంద‌రికీ ఆమె థ్యాంక్స్ తెలిపారు. రిషి సునాక్‌కు ఆమె ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ప్ర‌చారం చాలా విరోచితంగా సాగిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. పార్టీలో ఉన్న టాలెంట్ బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. బ్రెగ్జిట్ స‌క్సెస్ అయ్యేలా పుతిన్‌కు అండ‌గా నిలిచిన బోరిస్ జాన్సన్‌కు ఆమె థ్యాంక్స్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ అంశంలోనూ ఆమె బోరిస్‌ను మెచ్చుకున్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు.. ప‌న్నుల కోత విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు త‌ప్ప‌వ‌ని ఆమె తెలిపారు. బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన మేరీ ఎలిజిబెత్ ట్రస్ జులై 16, 1975లో జన్మించారు.