భారీ యుద్ధ కాన్వాయ్ ధ్వంసం.. వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

భారీ యుద్ధ కాన్వాయ్ ధ్వంసం.. వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్

March 29, 2022

రాజధాని కీవ్‌పై విరుచుకుపడుతున్న రష్యా దళాలను ఉక్రెయిన్ తన శక్తి మేరకు అడ్డుకుంటోంది. రష్యన్ ట్యాంకుల ధ్వంసం, మిస్సైళ్లను అడ్డుకోవడం వంటి కొన్ని విషయాల్లో ఉక్రెయిన్ రష్యాకు చికాకు పెడుతుంది. తాజాగా రష్యన్ కాన్వాయ్‌ని ధ్వంసం చేసిన వీడియోను ఆ దేశం విడుదల చేసింది. 65 కిలోమీటర్ల పొడవైన భారీ యుద్ధ కాన్వాయ్‌తో కీవ్‌ను ఆక్రమించడానికి వస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులను చాలా వరకు ధ్వంసం చేసినట్టు ప్రత్యేక రక్షణ దళం ప్రకటించింది. 30 మంది పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో రాత్రి సమయంలో డ్రోన్ల ద్వారా బాంబులను జారవిడిచామని వెల్లడించారు.ముందుగా కొన్ని డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల గుండా వెళ్లి రష్యా కాన్వాయ్ మీద మెరుపు దాడి చేశామని తెలిపారు. దాంతో కాన్వాయ్ మొత్తం నిలిచిపోయిందని, దాంతో మా పని సులువైందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను టెస్లా యజమాని ఎలన్ మస్క్ ఉపగ్రహం స్టార్‌లింక్ సహాయంతో చేసినట్టు వివరించారు. కాగా, టర్కీలో ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.