పుతిన్‌పై హత్యాయత్నం.. వెల్లడించిన ఉక్రెయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్‌పై హత్యాయత్నం.. వెల్లడించిన ఉక్రెయిన్

May 24, 2022

ప్రపంచంలోనే అత్యంత పటిష్ట భద్రతా వలయం ఉండే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్ వెల్లడించాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ దాడిలో పుతిన్ తప్పించుకున్నారని పేర్కొన్నాడు. ఈ మేరకు ఉక్రెయినిస్కా ప్రావడా తెలిపింది. వారి ప్రకారం.. ‘రెండు నెలల క్రితం పుతిన్ కాకసస్ పర్యటనలో ఉండగా ఈ ఘటన జరిగింది.

కాకసస్ అంటే నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ప్రాంతం. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమయిన తొలిరోజుల్లో ఈ సంఘటన జరిగింది. కానీ ఈ విషయాన్ని రష్యాలో తెలియకుండా రహస్యంగా దాచారు. రష్యాలో ఇప్పటికే పుతిన్‌పై అసంతృప్తి మొదలైంది. ఆగస్టు నుంచి ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. ఈ ఏడాది చివరినాటికి పుతిన్‌ను దించేసి కొత్త అధ్యక్షుడు వస్తాడు’ అని వివరించినట్టు తెలిసింది. అయితే దాడి జరిగిన ప్రాంతం గురించి మాత్రం చెప్పలేదు. కాగా, పుతిన్‌పై హత్యాయత్నం ఇదే తొలిసారి కాదు. గతంలో ఐదు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఈ విషయం పుతినే స్వయంగా చెప్పడం గమనార్హం.