వ్యూహాత్మక మలుపు దిశగా ఉక్రెయిన్ సైన్యం : జెలెన్‌స్కీ - MicTv.in - Telugu News
mictv telugu

వ్యూహాత్మక మలుపు దిశగా ఉక్రెయిన్ సైన్యం : జెలెన్‌స్కీ

March 12, 2022

war

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం కీలక మలుపు దిశకు చేరుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఈ మేరకు రాజధాని కీవ్‌లోని అధ్యక్ష భవనం ముందు నిలబడి మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. అందులో ‘ యుద్దం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. అయినా రష్యాకు లొంగే ప్రసక్తే లేదు. ఇప్పటికే మా దళాలు వ్యూహాత్మక మలుపుకు చేరుకున్నాయి. విజయం సాధించే దిశగా మా అడుగులు పడబోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక, అమెరికా విధించిన కొత్త ఆంక్షలతో రష్యా మరోసారి కీవ్‌పై దాడికి సిద్ధపడుతున్నట్టు అనిపిస్తోందని వెల్లడించారు. మరోవైపు పుతిన్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో శుక్రవారం మంతనాలు చేశారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనపడుతోందని పుతిన్ చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, యుద్ధం మొదలై నేటికి 17 రోజులవుతుంది. ఇప్పటి వరకు 25 లక్షల మంది పౌరులు శరణార్ధులుగా మారారని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.