అవి బంతులు కాదు..బుల్లెట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

అవి బంతులు కాదు..బుల్లెట్లు..

November 25, 2022

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ భాగంగా జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ ఓటమి చవి చూసింది. 307 పరుగుల లక్ష్యాన్ని భారత్ బౌలర్లు కాపాడలేకపోయారు. న్యూజిలాండ్ బ్యాటర్లు లాథమ్, విలియమ్సన్ వికెట్లు తీయలేక చేతులెత్తేశారు. అర్షదీప్ సింగ్, శార్థుల్ ఠాకూర్, చాహల్ ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే వన్డేలో ఆరంగ్రేటం చేసిన ఉమ్రాన్ మాలిక్ మాత్రం కొంత మేర సత్తా చాటాడు. ఆరంభంలో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను భయపెట్టాడు. మొదటి ఐదు ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.

తర్వాత 5 ఓవర్లలో కొంచెం ఎక్కువ పరుగులు సమర్పించకున్నా..తన బౌలింగ్‌తో అదరహో అనిపించాడు. ప్రతి బంతిని దాదాపుగా 150 కి.మీ దగ్గర వేసి నిప్పులు చెరిగాడు. ఉమ్రాన్ విసిరిన కొన్ని బుల్లెట్ బంతులకు న్యూజిలాండ్ బ్యాటర్లు దగ్గర సమాధానం లేకుండా పోయింది. అతని వేగానికి న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే(24), డారిల్ మిచెల్(11) వెనుదిరిగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌లో ఉమ్రాన్ వేసిన రెండో బంతి 153.1 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అవి బంతులు కాదు బుల్లెట్లు అని కొనియాడుతున్నారు. అనవసరంగా టీ20 వరల్డ్ కప్‌కు పక్కనబెట్టారని టీంఇండియా మేనేజ్ మెంట్‌ను విమర్శిస్తున్నారు. ఇకనైనా అవకాశాలు ఇచ్చి ఈ కశ్మీర్ ఎక్స్ ప్రెస్‌ను వాడుకోవాలని సూచిస్తున్నారు.